వదలనురా శంకరా…వదలను

ఓమ్ నమ:శ్శివాయ నమ:

వదలనురా శంకరా…వదలను
నీ పాదములెప్పుడూ వదలను..
మరువను గాక మరువను…
నీ నామస్మరణమునెన్నడూ మరువను..
ఏ క్షణము మదిలోన నిన్ను నిలిపావో తెలియదు…
ఏ క్షణము నాలోన నిన్ను చూపావో తెలియదు…!!వదలను!!

గరిటెడు గంగను తలపైన పోసి…
చిటికెడు విబూది నుదుటన రాసి…
నీ ఎదుటే నిలుచుని చూస్తూవుంటే మా రెండూ కళ్ళు…
రెప్పలు వాల్చము అన్నవి తెరిచేవరకూ నీ కళ్ళ కరుణ వాకిళ్ళు…
కానరా శంకరా…ఆర్ధ్రత నిండిన కన్నులు రాల్చే ఆనందాశ్రువులు..
వినరా శంకరా…అర్పించడమే తెలిసిన మది పలికే నీ పద కవితా కుసుమాలు…!!వదలను!!

లోలోన నాలోన ఏవేవో తెలియని భక్తి భావోద్రేక సంక్షిప్త సంఘర్షణలు..
జరుపమని కోరుతున్నాయి నా గుండె లయలు పరమేశ్వరునితో భక్తి హృదయ సంభాషణలు…
శలవియ్యరా శంకరా..వినిపించేను ఓ నాల్గు మాటలు..
“ఓం నమ:శ్శివాయా” అని పలుక నీ పంచాక్షరీ మంత్రాల  పలుకు తేనెల రతనాల మూటలు…
ఇంతకంటే వేరేమి వినిపించనయ్యా…
నే పలుకు ఆ ఒక్కమాట నీ మదిని తాకితే చాలు శివయ్య…!!వదలను!!

పాహిమాం… పాహిమాం… శివశంకరా..పాహిమాం..
రక్షమాం…రక్షమామ్..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top