రావయ్య ప్రభాకరా రావయ్యరా..
నీ భగ భగలు కాస్త ఆపి భాస్కరా రా…
ఉత్తరాయణ పుణ్యకాల తిథిన మకర రాశి లో ప్రవేశించి ప్రాకాశించ రా..
నీ ధగ ధగ ల కిరణాల మెరుపులతో దివి నుండి భువికి దిగిరారా దినకరా…
స్వాగతములు పలికేము రంగవల్లులతో…
వందనములు తెలిపెము గంగిరెద్దులతో…
మురిసేరు మా పల్లె పడచులు గొబ్బి పాటలతో…
పసుపు కుంకుమలే కోరు మాఆడపడుచులు నిలిచేరు హారతుల తో…
మకర సంక్రమణ వేళ శ్రీ సూర్యనారాయణ ఒక చిన్న మాట..
ఈశ్వరాంశూనివైన శుభకరా ప్రసరించరా నీ పుణ్యకిరణాలు ప్రతి ఇంట.. .
ప్రతి పల్లె కళ కళ లాడాలి పాడి పంటలతో….
ప్రతి ఇల్లు ఘుమ ఘుమలాడాలి పాల పొంగళ్లతో..
స్వీకరించవయా శివ సూర్యాయ అరిసెలు,బొబ్బట్ల మా భోగి వేడుకలు..
సేవించవయా శివశంకరాయ మా సంక్రాంతి తీపి కానుకలు.
నింగికొదిలిన సరదాల మా గాలి పతంగాలు…
నిండు మనసుతో నీకు మేము పంపిన సరాగాల భక్తి తరంగాలు…..
పసిడి పండించు రైతన్నసల్లగుండాలి…
పశుసంపదల తో ఈ భూమి నిండుగుండాలి…
పాహిమాం…పాహిమాం…శంకరా. పాహిమాం…
పర్వదిన శుభ వేళ పరమేశ్వరా రక్షమాం..రక్షమాం…