ఏమన్నవో మా కనులు తెలుసునా శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

ఏమన్నవో మా కనులు తెలుసునా శంకరా…
కలలు తీరెనన్నాయి నిను దర్శించుకొని నిజమయా ఈశ్వరా..
నిలుపుకున్నాయట పదిలముగ నీ రూపమును తమలోన…
ఆపుకోలేకున్నాయట ఆనందాశ్రువులు తమ రెప్పల చాటున…
విన్నావటయ్యా పరమేశ్వరా..
అందుకున్నావటయ్యా మా కనుల నివేదనలను జగదీశ్వరా…!!ఏమన్నవో!!

కనులలో వున్న నీ రూపము..
మదిలోకి చేరనీ నీ ప్రతిరూపమై…
వెలుగులీనితే నీ ప్రతిరూప ప్రకాశము…
వికసించనీ మా తనువు శివతత్వమై….
మనోవాంఛాఫలసిద్ధిరస్తూ అంటూ దీవించవయ్యా…
భక్తి పూర్వకమైన మా ప్రార్ధనలను విని ఆశీర్వదించవయ్యా…!!ఏమన్నవో!!

ఆశతీరదెందుకో ఎన్ని సార్లు వచ్చివెళ్ళినా నీ ఆలయానికి…
అలుపురాలేదెప్పుడూ ఎన్ని మెట్లెక్కివచ్చినా నీ గుడి ప్రాంగణానికి…
వచ్చాక దీవించి.. వెళ్ళి రమ్మంటూ పంపేవు నీవు…
చూడాలని వుంది రమ్మంటూ కలలోకి వచ్చి మళ్ళీ పిలిచేవు నీవు…
వదలవేమో మా మనసు నీవైపు మళ్ళించు వరకూ..
మము మరువవేమో..తనువు చాలించు వరకూ…!!ఏమన్నవో!!

పాహిమామ్..పాహిమాం..పరమేశ్వరా...పాహిమామ్…
రక్షమామ్..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top