ఓమ్ నమ:శ్శివాయ నమ:
పాడి కాదయా శంకరా…పరికించి చూడగా ఆగ్రహముగ…
పగవారమసలు కానెకాదయా హర హరా…
నీ చరణాలె దిక్కని పలుకుతున్నామయా ముక్తకంఠముగా…
శాంతించరా శంకరా..నీ కరుణ సిరిమొగ్గలను పూయించరా ఈశ్వరా…!!పాడి!!
అల్పులము మేము ఈ రీతి నిను దర్శించుకొని తట్టుకోగలమా..
అశక్తులము మేము..ఏ తీరు శాంతింతువో పట్టు తెలుసుకోగలమా..
రావాలి మా తల్లి శాంకరీ…
వచ్చి నీతో మమైకమవ్వాలి చిరుదరహాసములొలికింప భ్రామరీ..!!పాడి!!
కోరుతున్నామయా ఒకే ఒక్క వరమును…
నిత్యమూ చూడాలి కోటి వెన్నెల వెలుగులతో కళకళలాడుతూ వున్న నీ నగుమోమును…
ఏ క్షణము నిను దర్శించినా మరచిపోవాలి మమ్ము మేము…
నీ ధ్యాసలో లీనమై పోయి ప్రతి నిముషమూ నిన్ను చూడాలి మాలోన మాకు మేము…
దీవించరా శంకరా….కలనైనా..
కాస్త దయవుంచరా శంకరా…మాపైన…!!పాడి!!
పాహిమామ్..పాహిమాం…పరమేశ్వరా.
రక్షమాం..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమాం…