ఓం నమ:శ్శివాయ నమ:
సుమ సౌరభ శోభిత శైలపుత్రీ మానస సుందరేశా…
ఎంత భాగ్యమయా నిను కన ఈ రీతి మా కనులకు పార్వతీశా..
తీరని ఆశగా నిలిచిపోతుంటావు ఎన్నిసార్లు నిను దర్శించినా..
తెలియని బంధమైపోతుంటావు ఎంత యోచించినా…!!సుమ!!
విశ్వమోహనమైన విరులు మాలలై…
జగద్విఖ్యాతమౌ పరమేశ్వరా నీకు అలంకరణలై…
శోభాయమానముగ నీ దివ్యరూపము విరాజిల్లు చుండగా..
నీ కరుణ కిరణాలు లోకాన వెదజల్లు చుండగా…
పులకించెనయా భూమి కరుణించినావని….
శిరమొంచి విన్నవించేనయా మోసేను నీ సృష్టి భారమెంతైనానని..!!సుమ!!
అందమైన నీ సృష్టి సంపదలు మోయుచూ పుడమి అమ్మైనది మాకు…
కోటానుకోట్ల జీవరాశులను కడుపులో దాచుకొని చూచుకొను ధరణి… నేల తల్లయినది మాకు…
అద్భుతమైన కానుకగా అవనినిచ్చి భూమాతను అమ్మనవనిచ్చావు…
ఆ అమ్మ ఒడిలోనున్న పరమపావనమైన నీ గుడులు చూడ జన్మనిచ్చావు…!!సుమ!!
పాహిమామ్..పాహిమాం..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…