వలదు…వలదంటున్న వినదాయె శంకరా నా మనసు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:

వలదు…వలదంటున్న వినదాయె శంకరా నా మనసు…
నిత్యమూ నీ నామస్మరణమే  దానికి తపసు…
బయటపడదని తెలుసు తనకి నీ మాయలో పడితే…
అదే జరిగితే అంతకంటే ఏం కావాలంది నేనడిగితే…!!వలదు!!

ఏమున్నదో ఏమో పరమేశ్వరా నీ మోములోన…
దివ్యశక్తులు ప్రసరించు నీ కంటి కనుపాపలోన…
ఏమంత్రమేస్తావో నిను దర్శించు సమయాన…
పరమభక్తులై పోతాము వరమొంది పరవశాన…
గురుతు రావేమీ ఆ క్షణము మాకు ఏ ఇహ పర సుఖములు…
మరచిపోతామన్న మరపురానివి నిను గాంచిన పుణ్య క్షణములు…!!వలదు!!

భాష చాలక మా భక్తి భావవ్యక్తీకరణ చేయలేకున్నామయా…
మా మది చేయు మౌన ప్రార్ధనల పద పంక్తులను చదువుకొని పరిరక్షించవయా…
పలుకంగ పెదవులూ, మొక్కంగ కరములు రెండూ నువ్విచ్చినవేనయా…
ఏ కష్టమొచ్చినా చెప్పుకొని  మొక్కుటకు నీవు మాకు ఇచ్చిన వరమేనయా…!!వలదు!!

పాహిమాం..పాహిమాం.. పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top