మరచిపోయాయట శంకరా…
మా కనులు రెప్ప వాల్చటము..
గురుతురావటములేదట వాటికి తెప్పరిల్లటము…
సింధూర వర్ణ రవికిరణ తేజోమయ సుందరేశా నిను గాంచినాక…
సువర్ణ,పుష్ప,వస్త్రధారణ వైభవమున నిను దర్శించినాక..!!మరచి!!
తాకరా నీకంటి చూపుతో మా హృదయసీమను..
తడమరా ముక్కంటి…ప్రేమతో మా గుండె తలుపులను…
ఇంకిపోవకముందే ఆనందభాష్పాలు మా కళ్ళలో…
నిలిచిపోనివ్వు నీ రూపము మా కనుల వాకిళ్ళలో…
కనులు మూసినా మొదట కనిపించనీ నీ రూపమే…
కనులు తెరిచినా మొదట చూడనీ నీ రూపమే…!!మరచి!!
వేలాదివేల నాడులున్నాయి ఈ తనువులో నిలువునా..
నీ కరుణతో పలికితే చాలు ఓంకార నాదాలు అణువణువునా…
మారిపోదా బ్రతుకు చిత్రము ఉహించనట్లుగా ఈశ్వరా…
సమసిపోవా విధిలిఖిత కర్మఫలములు ఆశించినట్లుగా పరమేశ్వరా…!!మరచి!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…