తూరుపు తెల తెల వారుచుండగా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:

తూరుపు తెల తెల వారుచుండగా..
హేమంతము శ్రుతి మెత్తగా పురివిప్పుచుండగా…
ఉదయించె భానుడు ఒక్క ఉదుటన..
ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలమున…
కంటిమయా ముక్కంటి..నీ దివ్య రూపమును…
ప్రసరించుతుంటే సంక్రాంతి కాంతి పుంజములను…!!తూరుపు!!

భోగిమంటలు వేసి కాల్చామయా మాలోని కోర్కెల కర్రపుల్లలనీ..
గొబ్బి ప్రతిమను చేసి భక్తితో స్వాగతించాము రమ్మంటూ సంక్రాంతి శ్రీ లక్ష్మిని..
దీవించరా శంకరా..ప్రతి ఇల్లు వెలగాలి ధనధాన్యాల సిరి సంపదలతో…
వరమియ్యరా శంకరా..విశ్వక్షేత్రమున ప్రతి ప్రాణి కనిపించ ఆనంద నయనాలతో…!!తూరుపు!!

ఊరువాడలా గ్రామ సీమల గడప గడపకి తిరుగుతుంటే గంగిరెద్దు…
నీదు దూతలా ప్రేమమీరగా దీవించి దాటిపోతుంటే పల్లె సరిహద్దు…
వచ్చి వెళ్ళినట్లుంది నీ నంది ప్రతి ఇంటికీ…
దివి నుండి దిగివచ్చినట్లుంది నీ ఆజ్ఞ నెరవేర్చడానికి…
పర్వదిన శుభవేళ అడగకనే వరములియ్య ఎంత ముదమురా నీకు శంకరా…
అనీర్వచనీయమైన ఆనందముతో మంగళహారతులు తప్ప ఇంకేమివ్వగలవారమురా ఈశ్వరా…!!తూరుపు!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top