కరుణించినావా శివా…నన్నిలా కరుణించినావా…

కరుణించినావా శివా…నన్నిలా కరుణించినావా…
వరమిచ్చినా శివా..నా కింతటి వరమిచ్చినావా…
ఏనాడూ  మనసు పెట్టి  నిను పూజించింది లేదు నేను..
ఏరోజూ ధ్యాస పెట్టి  నిను  ధ్యానించింది లేదు నేను…

కోటాను కోట్ల భక్త జనులలో నను నీవు గుర్తించినావు…
పద కవితా పుష్పములను రచించి ఆర్తితో పూజించమని  నన్నెంచుకున్నావు..
క్రమము తప్పకుండా నా చేత ద్విశత అష్టోత్తర నీ పద భక్తి కవితలను వ్రాయించుకున్నావు…
రెండు వందలా పదహారు రోజులూ ప్రాస తప్పని పదములందించి ఆ పద కవితలకు వన్నె తెప్పించుకున్నావు…
చదివారు..పాడారు..భక్త జనులెల్లరూ…
కన్నారు…విన్నారు…భక్తితో వారెల్లరూ..

భాష ఊటబావి నుండి నీ భక్తి పద కవితకు పదములు గల గలా ఊరుతుంటే…
నా కర కలము నుండి నీ పద గీతికార్చనకు  అక్షరపుష్పాలు జల జల రాలుతుంటే…
వర్ణించనాలవి కాదాయే పరవశించి
 ఆ దివ్యానుభూతి పొందునపుడు నా మేను…
నిండిపోతుంది..భక్తి భాష్పాలతో తన్మయత్వం చెంది నా కంటి కొలను…
ఇంతటి ఆధ్యాత్మిక అనుబంధాన్ని నా కిచ్చిన శంకరా…
నే నెంతటి వాణ్ణని కరుణించినావురా శివశంకరా…
ఎవ్వరికీ…ఎప్పటికీ అర్ధం కానిదే శివా…నీ మాయ…
ఆశీర్వదించరా శివా…కడదాకా నీ  దయ తోనే  బ్రతికేలా కరుణామయా…
పాహిమాం…పాహిమాం..శివశంకరా..
రక్షమాం…రక్షమాం..అభయంకరా….

Leave a Comment

Scroll to Top